Prudhvi Raj: మంత్రి అమర్నాథ్ పై నటుడు, జనసేన నేత పృథ్వీ సెటైర్లు... వీడియో ఇదిగో!

  • విశాఖలో పర్యటించిన పృథ్వీ
  • ఏమొచ్చని అమర్నాథ్ ను ఐటీ మినిస్టర్ ను చేశారని ఆశ్చర్యం
  • చపాతీలు చేశాక చేతుల నుంచి రాలిన పిండి ఏరుకునే రకం అంటూ వ్యంగ్యం
Actor and Jansena leader Prudhviraj satires on AP minister Gudivada Amarnath

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టాలీవుడ్ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతడికి ఏం తెలుసని ఐటీ మినిస్టర్ ని చేశారో అర్థం కావడం లేదని అన్నారు. 

"ఈ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అని ఓ కుర్రాడ్ని అడిగాను... గుడ్డుకు ప్రసిద్ధి అన్నాడు. గుడ్డేంట్రా బాబూ అన్నాను. ఇక్కడి ఐటీ మినిస్టర్ గుడ్డే కదా అన్నాడు. ఇలాంటి వాళ్లందరూ ఐటీ మినిస్టర్లు! ఏమొచ్చని ఐటీ మినిస్టర్ ని చేశారు? మేం చదువుకుంది ఇక్కడే... ఆంధ్రా యూనివర్సిటీలో. అప్పుడు వాళ్ల (అమర్నాథ్) నాన్నగారు తెలుసు మాకు. కానీ ఇతను ఎప్పుడొచ్చాడు, ఏం చదివాడు, ఐటీ మినిస్టర్ ఎలా అయ్యాడు? 

ఇక్కడ చుట్టుపక్కల స్థలాలు ఏమేం ఉన్నాయో చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అతడ్ని మంత్రిగా పెట్టుకున్నట్టుంది. ఆడవాళ్లు చపాతీలు చేశాక వాళ్ల చేతి నుంచి గోధుమ పిండి రాలుతుంది... ఇతడు ఆ రాలిని పిండి ఏరుకునే రకం. 

గుడివాడ అమర్నాథ్... నువ్వు గాజువాకలో గెలిచే ప్రసక్తే లేదు. మా కూటమి అభ్యర్థికి ఇక్కడ 70 వేల మెజారిటీ ఖాయం. మీరంతా షెడ్డుకు వెళ్లడమే. జూన్ 4న రిజల్ట్ వచ్చాక రోడ్డు మార్గంలో వెళ్లిపోయేవాడు రోడ్డు మార్గంలో వెళ్లిపోతాడు, విమానాల్లో వెళ్లిపోయేవాళ్లు విమానాల్లో వెళ్లిపోతారు... బాగా డబ్బులు దొబ్బారు కదా! ఇలాంటి వాళ్లందరూ ఎన్నికలయ్యాక వెళ్లిపోవడం ఖాయం... అప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది... రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన ఉంటుంది.

జనసేనాని పవన్ కల్యాణ్ తన గళాన్ని అసెంబ్లీలో వినిపించడం ఖాయం. పిఠాపురంలో ఆయనను ఓడించడానికి ఇంటికో లక్ష ఇస్తున్నారట, ఇంటికో బైకు ఇస్తున్నారట. నేను పిఠాపురం నుంచే ఇక్కడికి వచ్చాను. పిఠాపురం ప్రజలేమంటున్నారో తెలుసా... ఒరే లఫూట్, మీరు ఇచ్చేదేంట్రా బైకులు... మాకు ఎప్పటినుంచో బైకులు ఉన్నాయి, మూడు పూటలా భోంచేస్తున్నాం రా... మీరిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడలేదురా అంటున్నారు. 

ఉప్మా ముద్రగడ అని ఒకాయన ఉన్నాడు. కాపు నేతలం అని చెప్పుకుంటారు. కాపులను వాడుకోవడం తప్ప కాపులకు వీళ్లు చేసిందేమీ లేదు. జనసేన పార్టీని భూస్థాపితం చేస్తారట... గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందన్న విషయాన్ని ఇలాంటి వాళ్లు గ్రహించాలి" అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు.

More Telugu News